పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0074-3 సామంతం సం: 05-255

పల్లవి:

ఏకాలమేది దనకెట్ల సుఖమైయుండు -
నాకాలవశతఁ దానట్లుండవలనె

చ. 1:

బలువియోగాగ్ని దలఁపంగ నెట్టిదొకాని
చలిగాలి యెండనుచు జాలిఁ బడవలనె
వలరాజుకోపమెటువంటిదో పడఁతులకు
తలిరాకు చేఁదనుచుఁ దలపోయవలనె

చ. 2:

భావంబు తలపోఁత బలిమెట్టిదోకాని
నోవి దోఁపనిచోట నొచ్చెననవలనె
ఈ విరహపరితాపమిఁకనెట్టిదో కాని
కోవిలల కూఁతలకుఁ గోపించవలనె

చ. 3:

తిరువేంకటేశుకృప తియ్యమెట్టిదొ కాని
చిరునవ్వు మోవిపైఁ జెరలాడవలనె
సురతసౌభాగ్యముల సొంపులెట్టివొ కాని
మురిపెంపుఁ గనుచూపు ముయ్యఁగావలనె