పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0074-2 కాంబోది సం: 05-254

పల్లవి:

పేగుల జంద్యాలు వేసి పెంచపునమలిపురి
పాగగాఁ జుట్టిన నాబాఁపనయ్య వీఁడివో

చ. 1:

బిత్తలై పరువులిడి పిన్నబోడితలతోడ
కొత్తబొమ్మచారియై గోచిగట్టెను
నెత్తురుదానమునేసి నిండిన జడలతోడ
బత్తుఁడైన చక్కని నాబాఁపనయ్య వీఁడివో

చ. 2:

కఱవిద్యబాఁపనిచేఁ గఱచె నేరుపులెల్ల
గుఱుతుబాఁపనిఁ గనెఁ గొడుకుఁగాను
తఱితోడ సందెపొద్దు దప్పనీక జలధిలోఁ
బఱపుగాఁ బండిన నాబాఁపనయ్య వీఁడివో

చ. 3:

పచ్చియిఱ్ఱి తోలుచొచ్చి బడలి చొరనిచోటు
చొచ్చి తెచ్చె వేదాలు చూడరమ్మా
మచ్చిక వేంకటగిరి మరిగి నాకౌఁగిట
పచ్చనిదోపతి నాబాపనయ్య వీఁడివో