పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0074-1 శుద్ధదేశి సం: 05-253

పల్లవి:

కానరటె పెంచరటె కటకటా బిడ్డలను
నేను మీవలెనే కంటి నెయ్యమైన బిడ్డని

చ. 1:

బాయిటఁ బారవేసిన పాలు వెన్నలును
చేయివెట్టకుందురా చిన్నిబిడ్డలు
మీయిండ్లు జతనాలు మీరుసేసికొనక
పాయక దూరేరేలే ప్రతిలేని బిడ్డని

చ. 2:

మూసిన కాఁగుల నేయీ ముంగిటి పెరుగులూ
ఆసపడకుందురా ఆడేబిడ్డలు
వోసరించి మోసపోక వుండలేక మీరు
సేసేరింతేసి దూరు చెప్పరాని బిడ్డని

చ. 3:

చొక్కమైన కొప్పెరల జున్నులు జిన్నులును
చిక్కినవిడుతురా చిన్నిబిడ్డలు
మిక్కిలి పూజలు నేసి మెచ్చించఁ దగదా
యెక్కువైన తిరువేంకటేశుఁడైన బిడ్డని