పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0073-4 శ్రీరాగం సం: 05-250

పల్లవి:

ఇచ్చకాలు రమణికి నెంత చేసేవు నీ-
ముచ్చిమిసేఁతలిన్నియు మూసేటి కొరకా

చ. 1:

బెట్టుగఁ బెద్దతురుము పెట్టేననుచు నింతి-
తట్టుపుణుఁగునెరుల తలదువ్వేవు
గట్టిగ నెవ్వతెఁ గూడో కౌఁగిటఁదెచ్చిన నీ-
తట్టుపుణుఁగుల తావి దాఁచేటికొరకా-

చ. 2:

గబ్బివై నీపదకము గట్టేననుచుఁ జెలి-
గుబ్బల మించుఁజెరఁగుకొంగు దీసేవు
వుబ్బున నెక్కడనో వుండి నీవిదె వచ్చిన-
దెబ్బలవాట్ల తప్పు దీరేటికొరకా

చ. 3:

ఇప్పుడిట్లనే విడెమిచ్చేననుచు నీవు
కప్పురము ఘనముగఁ గడునిచ్చేవు
అప్పుడె శ్రీ తిరువేంకటాద్రీశ యీ యింతి
చొప్పుదప్ప రతిఁగూడి చొక్కించుకొరకా