పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0071-3 ఆహిరి సం: 05-237

పల్లవి:

ఆపదలె సంపదలకాధారమై తోఁచె
పైపైనె తమకంబె పరిణామమాయ

చ. 1:

పురిగొన్న మదనాగ్ని పుటము దాఁకినవలన
తరుణిదేహంబు కుందణమువలెనాయ
నురుగక వియోగాగ్ని చొచ్చి వెలువడెఁ గాన
మరుజన్మమై మహమహిమఁ బొగడొందె

చ. 2:

పొలుపైన యిరులచేఁ బూవుగట్టిన వలన
సొలయకే మేను జాజుల పొట్లమాయి
నెలకొన్న గొజ్జంగనీటఁ దడియఁగఁబట్టి
కలకంటిమేను పులు గడగినట్లాయ

చ. 3:

అందుపైఁ దిరువేంకటాద్రీశు నిజకృపా-
నందంబు తనకు బ్రహ్మనందమాయ
పొందైన వేడుకలు పొదిగొన్న చెలువంబు-
నందమయి సౌభాగ్యమగ్గలంబాయ