పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0069-2 శ్రీరాగం సం: 05-224

పల్లవి:

పట్టనిఁకనోప నాప్రాణంబులు నీ-
పట్టు దైవమె యెరుఁగు బ్రదుకవయ్యా

చ. 1:

పడితినిన్నాళ్ళు నిర్భంధమున నాచేత
కడమొదలు లేని కాఁకల సొలపుల
బడలెఁ గడు నామేను పట్టనిఁకనోప నీ-
పడఁతులను గూడుకొని బ్రదుకవయ్యా

చ. 2:

నొగిలితివి నాచేత నొప్పిమాటలనెంతె
వగలఁ గడు నన్ను విడువఁగనోపక
జగడమిఁక లేదు విరసము మాని సుఖివియై
పగలేక యిఁకనైన బ్రదుకవయ్యా

చ. 3:

ఎంత నొగిలినను నాకేమాయ నీకు నీ-
సంతోషమబ్బినను జాలుఁగాక
యింతసేసియు వేంకటేశ కూడితివి నీ-
పంతంబు చెల్లెనిఁక బ్రదుకవయ్యా