పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0069-1 కన్నడగౌళ సం: 05-223

పల్లవి:

కామయాగము చేసెఁ గలికి తన-
ప్రేమమే దేవతాప్రీతిగాను

చ. 1:

పొలుపలర సురతతాంబులరసపానంబు
నలినాక్షి సోమపానంబు గాను
కలకలంబుల మంచి గళరవంబుల మోఁత
తలకొన్న వేదమంత్రములుగాను

చ. 2:

పడఁతి తన విరతాపమునఁ బుట్టిన యగ్ని
అడరి దరికొన్న హోమాగ్నిగాను
ఒడఁబడిక సమరతుల నుదయించిన చెమటఁ
దడియుటే యది యవభృథంబుగాను

చ. 3:

తనరఁ గుచముల రుచులు దంతాక్షత క్రీడ
ననుపైన పశుబంధనంబుగాను
యెనసి శ్రీతిరువేంకటేశ్వరుని పొందు
ఘనమైన దివ్యభోగంబుగాను