పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0068-3 సామంతం సం: 05-219

పల్లవి:

అడుగడుగుకు నీ వాడఁగాను మా-
బడలికంతయుఁ దోయ పండరంగిరాయ

చ. 1:

పాదికెత్తు మెరుఁగారు బంగారుగుండు
సేదదేర మెడఁగట్ట చిత్తగించితి
యేదెస కానికదెచ్చి యిచ్చిరి నీ కెవ్వరో
పాదపుగజ్జెలు మోయ పండరంగిరాయ

చ. 2:

మద్దికాయలు చెవుల మాణికాల పోఁగులు
పెద్దపెద్దముత్యాలు పెంపు మీరఁగా
ముద్దల వెన్నపాలు ముచ్చిలించు సేఁతలవి
బద్దుల పనులైపోయ పండరంగిరాయ

చ. 3:

వెల్లిగొను వేడుకల వేంకటాదిపతివై
తెల్లనికన్నుల నవ్వుతీగె సోగల
గొల్లెతల గుబ్బలపై కూరిమి మెరయఁగా
పల్లకి నీకిప్పుడాయ పండరంగిరాయ