పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0065-5 ఆహిరి సం: 05-203

పల్లవి:

ఎంతపని యిది యానతియ్యరాదా యీ-
చింతచే నీ మనసు చిముడఁబెట్టేవు

చ. 1:

పండువెన్నెల బయటఁ బవళించి వేడుకల-
నుండి చెలి యేఁటికో వుసురంటివి
కొండుకవయసు నిడుకోరికల నిట్టూర్పు-
టెండలనె యీ చిత్తమేల వేఁచేవు

చ. 2:

తూఁగు మంచముమీఁదఁ దురుముఁ బయ్యద జార-
నూఁగుచును నేఁటికో వుసురంటివి
కాఁగేటి కుచగిరులు కమ్మఁజెమటలఁ దొప్పఁ-
దోఁగగా తమకంబు తొలఁగ దాఁచేవే

చ. 3:

నిద్దంపు వేడుకల నీవు వేంకటవిభుని-
వొద్దికై యేఁటికో వుసురంటివి
వొద్ద నీకెపుడాతఁడుండవలె నాతనిని
వద్దనఁగ రాదనుచు వాడఁబారేవు