పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0065-4 ముఖారి సం: 05-202

పల్లవి:

కలిసి కాఁకలఁబెట్ట కనుసన్నలనె తిట్ట
చలపట్ట నీకుఁ జెల్లే జాణఁడే యతఁడు

చ. 1:

పగటుగుబ్బలురాయ పసిఁడి మట్టెలు మ్రోయ
నగవువెన్నెల గాయ నడచేవు
వగ నిన్ను భ్రమయించ వలపువారిధి ముంచ
జగడాలు వచరించ చతురుఁడే యతఁడు

చ. 2:

చూపులనె పగచాట సొబగులఁ గనుగీఁ టఁ
దీపు పైపైమీఁటఁ దిరిగేవు
కోపగింతలనేఁప కూరిములు పైఁజాఁప
రావులు పెరరేఁప రసికుఁడే యతఁడు

చ. 3:

సందుల దండలు జార జవ్వాదిచెమట గార
నందములు దైవార నలసేవు
కందువుల నినుఁగూడి కరఁగి సిగ్గులు వీడి
విందై నీతోడుతనాడే వేంకటేశుఁడితఁడు