పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0065-1 కాంబోది సం: 05-199

పల్లవి:

కూరిములే కదవమ్మ కోపమయ్యీని కడు-
భారమైన పోటుగాదా పచ్చిదేరే పలుకు

చ. 1:

పున్నమచందురుని తోఁబుట్టుగైన నీమోము-
వెన్నెలలే కదవమ్మ వేఁచఁజొచ్చీని
పన్నిన పగల వెలుపటివారికంటెను
ఎన్నరాని పగగాదా యింటిలోని పోరు

చ. 2:

చిత్తజుని జనియించఁ జేసే మొక్కలపు నీ-
చిత్తమిదే కదవమ్మ సిగ్గు వాపీని
మిత్తివలెఁ జెలరేఁగి‌ మీఁదఁగానే యెండకంటే
నెత్తిమీఁదిచిచ్చుగాదా నీడలోని యెండ

చ. 3:

కట్టఁగడ చందనపుగాలికి మీరిన నీ-
నిట్టూరుపులేకావా నిగ్గుదేరీని
యిట్టె యివె తిరువేంకటేశుఁగూడఁ బట్టి నీకు
చుట్టపుఁ బగలే మంచిచుట్టములైనవి