పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0064-6 ధన్యాశి సం: 05-198

పల్లవి:

ఇందూ నందును రుచులెట్లుండునో
కందువెరిఁగి మేలుకైకొందువు

చ. 1:

పదివేలు పళ్యాల పళ్ళిభోగము నీఁ
వదన నారగింతువప్పాలతో
పొదవిన యింతేసి పొందైన మతితో నీ-
సుదతికెమ్మోవినే చొక్కితివిగా

చ. 2:

సరిలేని కల్పభూజముల పూవుల పూజ
సిరులుగా సురలచేఁ జేకొందువు
పరిపరివిధముల పరిమళములనెడి-
తరుణి పువ్వులతావిఁ దగిలితిగా

చ. 3:

కొత్తయిన కస్తూరితోఁ గోరి తట్టుపుణుఁగు
మెత్తుకొందువు నీవు మేనిండను
ఇత్తరిఁ దిరువేంకటేశ యీ చెలిఁగూడి
హత్తిన చెమటలతో నలరితిగా