పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0063-5 శ్రీరాగం సం: 05-191

పల్లవి:

చలిగాలి వేఁడేల చల్లీనె కప్పురపు
మలయజము తానేల మండీనే

చ. 1:

పాపంపు మనసేల పారీనే నలుగడల
చూపేల నలువంకఁ జూచీనే
తాపంపుమేనేల తడవీనె పూవింటి-
తూపేల చిత్తంబు దూరీనే

చ. 2:

వాయెత్తి చిలుకేల వదరీనె పలుమారు
కోయిలలు దామేల గొణఁగీనే
రాయడికి నలులేల రాసీనె మాతోను
కాయజుఁడు తానేల కసరీనే

చ. 3:

ఏకాంతముననేల యెదురైతినే తనకు
లోకాధిపతికేల లోనైతినే
చేకొనిదె మన్నించె శేషాద్రివల్లభుఁడు
పైకొనిదె మమ్మేల పాలించెనే