పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0063-3 మాళవి సం: 05-189

పల్లవి:

తఱచు సూసకపు ముత్యపుఁ దలఁబాలతో
నెఱుల తుఱుము వంచీనె నెలఁత

చ. 1:

పచ్చఁదోరణముఁ బలుకులింటికిని
పచ్చిముత్యాలనే కట్టె బాసికము
ముచ్చటలేనగవుల ముంగిట ముగ్గులుపెట్టి
నిచ్చకల్యాణములాడీనే నెలఁత

చ. 2:

బచ్చెనల మెఱుఁగు గుబ్బల అయిరాణి దెచ్చి
కుచ్చుఁ బులకల బూజ గుండలాయను
దిచ్చరిమరునిఁ దెచ్చి తెరమరఁ గెడలించి
హెచ్చిన పెండ్లికూఁతురే నెలఁత

చ. 3:

మరువింటి పేరింటి మంచిలగ్నమునందు
పరువంపుఁ జనుదోయి పరుపుమీఁద
తిరువేంకటగిరిదేవునికౌఁగిటఁ గూడి
నిరతంపు సిరులందెనే నెలఁత