పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0063-2 ఆహిరి సం: 05-188

పల్లవి:

గుట్టునఁ గోరికలెల్లఁ గొల్లవట్టీ నీ-
పట్టపుదేవికి నీకుఁ బల్లాండు పల్లాండే

చ. 1:

పచ్చల సందిదండలు బాహుపురులు మెరయ
నెచ్చెలిపై మేను సోఁక నిలుచుండి
పచ్చవిలుకానితల్లి బంగారు దోసిట నీపై
బచ్చకప్పురము చల్లీఁ బల్లాండు పల్లాండే

చ. 2:

మంతనపు మాఁటలతో మాఁటుగ నిన్ను సొలసి
కొంతపు గోళ్ళ నిగ్గు గుమ్మరింపుచు
చెంతలఁజెంగలువలు చెలులు చేనందియ్యఁగ
పంతమున నీపై వేసి పల్లాండు పల్లాండే

చ. 3:

అలరుల మేడలోన అలమేలు మంగ నీ
యలయిక దీరఁ బ్రేమ నలరఁ జేసి
కలసి వేంకటేశ నీ కౌఁగిలి చేకొనీ నిదే
పలుమారు మీకు మీకుఁ బల్లాండు పల్లాండే