పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0062-5 శ్రీరాగం సం: 05-185

పల్లవి:

పిడికిటి తలఁబాల పెండ్లికూఁతురు కొంత
పెడమరలి నవ్వీనె పెండ్లి కూఁతురు

చ. 1:

పేరుకల జవరాలె పెండ్లికూఁతురు పెద్ద-
పేరులముత్యాలమేడ పెండ్లికూఁతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లికూఁతురు విభుఁ
బేరు కుచ్చ సిగ్గువడీఁ బెండ్లికూఁతురు

చ. 2:

బిరుదు పెండెము వెట్టెఁ బెండ్లికూఁతురు నెర-
బిరుదు మగనికంటెఁ - బెండ్లికూఁతురు
పిరిదూ రినప్పుడె పెండ్లికూఁతురు పతిఁ
బెరరేఁచీ నిదివో పెండ్లికూఁతురు

చ. 3:

పెట్టెనె పెద్దతురుము పెండ్లికూఁతురు నేఁడె
పెట్టెఁడు చీరలుగట్టెఁ బెండ్లికూఁతురు
గట్టిగ వేంకటపతికౌఁగిటను వడి-
పెట్టిన నిధానమైన పెండ్లికూఁతురు