పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0062-4 కాంబోది సం: 05-184

పల్లవి:

ఇదె మొగంబిదె యద్దమిఁకనేఁటికే మిగులఁ
బదరేవు చెలివద్ద బవళించి నీవు

చ. 1:

పెట్టినది నాయకుని బిరుదు పెనుఁబెండెంబు
కట్టినది యతనిమెడ కంటమాల
యెట్టు బొంకెదవె చెలి యిందాఁక బంగారు-
పట్టేమంచముమీఁదఁ బవళించి నీవు

చ. 2:

పుక్కిటిది నాయకుని పొందైన తమ్ములము
చెక్కిటిది పతినొసలి చిన్నిచెమట
యిక్కు వెరిఁగియు బొంకనిఁకనేలె చెలి యతని-
పక్కనే యిందాఁకఁ బవళించి నీవు

చ. 3:

బచ్చెనలు కుచయుగముపై నతని మృగమదము
లచ్చెనలు కొనగోళ్ళలాంచనములు
ఇచ్చకునిఁ దిరువేంకటేశుఁ గూడితివె చెలి
పచ్చలోవరి లోనఁ బవళించి నీవు