పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0062-3 శ్రీరాగం సం: 05-183

పల్లవి:

చెల్లఁబో అలుగ నేఁడు సిగ్గుగాదా
వొల్లని వీనిఁ బాసి వుడికి నామనసు

చ. 1:

పొలసి యీ ప్రాణమిట్టే పోయినాఁ బోయఁ గాక
తలవంపు సేసే యీ తను వేఁటికే
కలసియుఁ గలయని కఠిచిత్తుని వీని
సొలసి కమ్మరఁ జూచీ నా మనసు

చ. 2:

మరుతాపమున మేను మాఁడిన మాఁడెఁగాక
పరులబారికిఁ జిక్కే బ్రదుకేఁటికే
విరహన నొకతెవై వేదనఁ బొరలు వీని-
కరుణలే కోరీని కష్టపు నామనసు

చ. 3:

సడిఁబెట్టి వయసిట్టే చంపినఁ జంపెఁ గాక
వడిఁ బెట్టి వేఁచే నావయసేఁటికే
కడు జాణఁడైన వేంకటగిరీంద్రుఁడు వాని-
వొడలు సోఁకిన నిట్టే వుబ్బెడి నామనసు