పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0062-2 ఆహిరి సం: 05-182

పల్లవి:

శిఱుత నవ్వులవాఁడు శిన్నెకా వీఁడు
వెఱపెఱఁగడు సూడవే సిన్నెకా

చ. 1:

పొలసుమేనివాఁడు బోరవీఁపువాఁడు
సెలసు మోరవాఁడు సిన్నెకా
గొలసుల వంకల కోరలతో బూమి
వెలసినాఁడు సూడవే సిన్నెకా

చ. 2:

మేఁటి కుఱుచవాఁడు మెడమీఁది గొడ్డలి-
సీటకాలవాఁడు సిన్నెకా
ఆఁటదానిఁ బాసి అడవిలో రాకాశి-
వేఁటలాడీఁ జూడవే సిన్నెకా

చ. 3:

బింకపుమోఁతల పిల్లఁగోవివాఁడు
సింక సూపులవాఁడు సిన్నెకా
కొంకక కలికియై కొసరి కూడె నన్ను
వేంకటేశుఁడు సూడవే సిన్నెకా