పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0062-1 ఆహిరి సం: 05-181

పల్లవి:

ఎంతవడి దాఁక నీ యెల యింపులు
నంతమై విభునికిటు చనవియ్యరాదా

చ. 1:

పొగరుఁగెమ్మోవి గిరుపుల నగవులాఁడి నీ-
పగడవాతెర దెరచి పలుకవమ్మా
బిగువుఁ బొలయలుక మురిపెముల నీ సొబగెల్ల
సగమాయఁ జలమింకఁ జాలించరాదా

చ. 2:

కలికి నునుమెఱుఁగుఁ బుల కల గుబ్బలాఁడి నీ-
సొలపుఁ గన్నులు దెరచి చూడవమ్మా
వలపు వసివాడ జవ్వనపు లేఁదీగతో
తలఁకేవు కోపంబు తలఁగించరాదా

చ. 3:

లావణ్యముల సొబగులాఁడి నీ ప్రియుఁడైన-
కోవిదునిపైఁ బ్రేమ గులుకవమ్మా
శ్రీ వేంకటేశ్వరుఁడు చెలఁగి నిను మన్నించె-
నీ వేఁడుకలనైన నిట్లుండరాదా