పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0061-3 సామంతం సం: 05-177

పల్లవి:

ఎటువంటి భోగి వీఁడెటువంటి జాణ
వటపత్రమున నున్నవాఁడా వీఁడు

చ. 1:

పొదిగొనఁ బూచిన పున్నాగతరులలో
పొదలు బుప్పొళ్ళపైఁ బూఁదేనె సోనలు
గదలుచు జడివానకాలంపుఁ బెదపెద్ద-
నదులై పారనున్నతిని
కదలని నడిగడ్డ కల్పభూజంబుల
పదిలమైన నీడ బంగారు చవికెలో
కదిసిన జలరాశి కన్నెకౌఁగిటఁ గూడి
వదలకెప్పుడు నున్నవాఁడా వీఁడు

చ. 2:

వలనగు తావుల వాంతికలలోన
కెలఁకుల నరవెడ్పుఁ గెందామరలయందు
పొలయుచు గొజ్జంగపూవుల దూళితో
లలితంపు గాలి చల్లఁగను
కొలందిమీరిన మంచి కోనేటి పన్నీటి-
జలములలో నున్న జలముఖులుఁ దాను
అలరుచుఁ దననోలలాడుచు నేప్రొద్దు
వలపులు చల్లినవాఁడా వీఁడు

చ. 3:

లోకము లోపలి లోలలోచనలెల్లా
జోకైన తనవాలుఁ జూపులచేఁ జిక్కి
యీకడాకడ చూడనెఱఁగక నిజమైన-
సాకారమునకె మెచ్చఁగను
పైకొన్న సరసపుఁ బలుకులఁ గరఁగించి
యేంకాతమున సౌఖ్యమెల్లఁ జేకొనుచుఁ దా-
నీకడఁ దిరువేంకటేశుఁ డై యున్నాఁడు
వైకుంఠపతియైన వాఁడా వీఁడు