పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0031-6 శంకరాభరణం సం: 05-174

పల్లవి:

వెక్కసమగుఁ గుచవిభవములు
జక్కవా పులుగుల జగడములే

చ. 1:

చింతచేత నిదె చెలియ నుదిటిపై
చెంతలఁ జెదరిన చిరునెరులు
కాంత కన్నులను గండుమీలకును
కంతుఁడు వేసిన గాలములే

చ. 2:

తమకంబునఁ గాంతకుఁ గరమూలపు-
చెమటల తావుల చెలువములు
మమతలఁ బెంచిన మరుని కొంతముల-
జమళితీఁగెలకు జలకములే

చ. 3:

తెఱమోవిపై తిరువేంకటపతి
గుఱుతులు సేసిన కురుఁబసలు
ఒఱగి వివశతల నుండఁగ సురతపు
మఱపులు దెలిపిన మర్మములే