పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0029-3 ఆహిరి సం: 05-164

పల్లవి:

కామిని నీ సౌభాగ్యము గలిగిన ఫలమిది గలిగెను
ఆమని వెన్నెలకేఁటికి నలయుచు వచ్చెదవే

చ. 1:

గుబ్బల చెమటల పయ్యెద కొనగొంగున నల్లార్పుచు
ఉబ్బున గమనావస్థల నూఁటాడెదవేలే
బబ్బిలికాయల రవములు పదనూపురములఁ గెలయఁగ
తబ్బిబ్బుగ నునుపాదము తాటించెదవేలే

చ. 2:

ఎత్తిన కరమూలపురుచులిరుగడ మెఱుఁగులు దొలఁకఁగ
తత్తరమందుచు నెవ్వనిఁ దలఁపుచు మ్రొక్కెదవు
ముత్తెపుసరముల వేఁగున మరియుచు నెచ్చరివై నీ-
వొత్తిలి నిట్టూర్పులతో నొయ్యన పలికెదవే

చ. 3:

తావులు చల్లెటి దేహము తలఁపులుమీరిన హరుషము
లోవెలుతుల వెడయాసలు లోపలి కోరికలు
శ్రీవేంకటగిరినాథుని చెలువపు కౌఁగిటి వుయ్వల
భావజసౌఖ్యాంబుధిలో పలుమరుఁ జెలఁగెదవే