పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0029-4 కాంబోది సం: 05-165

పల్లవి:

చెలికిఁ జక్కఁదనము నేసిన యజుఁడు భూమిఁ
గలవారికెల్లఁ బ్రేమ గలిగించెఁ గదవే

చ. 1:

గుబ్బలపై కొనగోరి గురుతు లంటినచోటు-
లబ్బురమై మృగమందమంటినది చూడవే
గబ్బికన్నుల కలికి కప్పిన పయ్యదలోన
నిబ్బరపుఁ దనువల్లి నిగ్గులు వెళ్ళఁబారెనే

చ. 2:

కొప్పునఁ దట్టుపుణుఁగు కొలఁదిమీరఁగ నంటిన-
జిప్పిలి చెక్కులవెంటఁ జిందినది చూడవే
ఒప్పయిన నీ నడపున నొడికపుమట్టియల-
చప్పుడు విన్నఁ జిత్తము జల్లురనెఁ గదవే

చ. 3:

చక్కఁదనములచేత సరిలేనివాఁడు గన
దిక్కుల వెలసినట్టి తిరువేంకటేశుఁడు
మక్కువలరఁగ నింతి మరగించి ప్రియమెల్లఁ
జక్కఁదనముగఁ జేసెఁ జాలదా యింతయును