పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0029-2 పాడి సం: 05-163

పల్లవి:

ఏలేయేలే మరఁదలా చాలుఁజాలు చాలును
చాలు నీతోడి సరసంబు బావ

చ. 1:

గాఁటపు గుబ్బలు గదలఁగఁ గులికేవు
మాటలఁ దేటల మరఁదలా
చీటికి మాటికిఁ జెనకేవే వట్టి-
బూటకాలు మాని పోవే బావ

చ. 2:

అందిందె నన్ను నదలించి వేసేవు
మందమేలపు మరఁదలా
సందుకోఁ దిరిగేవు సటకారి వోబావ
పొందు గాదిఁకఁ బోవే బావ

చ. 3:

చొక్కపు గిలిగింత చూపుల నన్ను
మక్కువ నేసిన మరఁదలా
గక్కున నను వేంకటపతి కూడితి
దక్కించుకొంటివి తగులైతి బావ