పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0029-1 సామంతం సం: 05-162

పల్లవి:

ఎన్ని సేఁతలై నఁ జేయునిపుడు యీతఁడు
కన్నెవయసువారినెల్ల గాఁకదేర్చె నీతఁడు

చ. 1:

గుబ్బచన్నుదోయి మెఱుఁగుఁ గులుకరించి చెలఁగి నడచు
గబ్బుతావిరమణి చల్లకడవతోడను
సిబ్బమైన చెక్కులందు చిన్నిచెమటగారఁ జెనకి
గబ్బిసేఁతలెల్లఁ జేసె కళలుగరఁగ నీతఁడు

చ. 2:

వాలుఁగన్నుదోయి మెఱుఁగు వల్లెవేసివేసి రతికి
కాలుదవ్వురమణి చల్లకడవతోడను
కేలుదమ్మి కంకణాలు గిలుకరించి చెలఁగి నడచు
కీలుగొప్పు సడిలి జారఁ గిందుపరిచె నీతఁడు

చ. 3:

కొదలుదేరు కోవిలెలుఁగు కుత్తికందు సాళగించి
కదలుమోవిరమణి చల్లకడవతోడను
ఎదురమెరయు వేంకటేశుఁడింతి ప్రేమదీరఁ జెనకి
కదిసి మదనకదనమందు కలికిఁజేసె నీతఁడు