పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0028-5 పాడి సం: 05-160

పల్లవి:

అలమేలుమంగ నీవభినవరూపము
జలజాక్షుకన్నులకు చవులిచ్చేనమ్మా

చ. 1:

గరుడాచలాధీశు ఘన వక్షమున నుండి
పరమానందం సంభరితవై
నెరతనములు చూపి నిరంతరము నాథుని
హరుషించఁగఁ జేసితి గదమ్మా

చ. 2:

శశికిరణములకు చలువల చూపులు
విశదముగా మీఁద వెదచల్లుచు
రసికత పెంపునఁ గరఁగించి యెప్పుడు నీ-
వశము చేసుకొంటి వల్లభునోయమ్మా

చ. 3:

రట్టడి శ్రీ వేంకటరాయనికి నీవు
పట్టపురాణివై పరఁగుచు
వట్టిమాఁకులిగిరించు వలపుమాటల విభు
జట్టిగొని వురమున సతమైతివమ్మా