పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0028-2 ముఖారి సం: 05-157

పల్లవి:

కలికి కోరికల నుంగరము వెట్టిననాఁడె
చెలువంపు విరహగ్ని సేసెఁగా పెండ్లి

చ. 1:

గరిమెఁ గేయూరకంకణహస్తముల సతులు
మురియుచును నిన్ను గరములఁ జూపఁగా
తరుణి నినుఁ జూచినంతటనె మదనుఁడిద్దరికి-
నరవిరుల సేసలిడె నాయెఁగా పెండ్లి

చ. 2:

పొదరిండ్ల చవికెలో పువ్వుఁదేనెల చెమట
చెదరకిరువంక నభిషేకములుగా
కొదమ తేంట్ల విప్రకోటి మిమ్మిద్దరిని
పొదలించఁ జిత్తములు పొసగెఁగా పెండ్లి

చ. 3:

సోలుచును పేరఁటపు శుకపికంబులు మిమ్ముఁ
బాలుపడి నలుగడలఁ బాడఁగాను
తేలించి లలితాంగి తిరువేంకటేశ నినుఁ
గాలు దొక్కినదిపుడె కలిగెఁగా పెండ్లి