పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0028-1 ముఖారి సం: 05-156

పల్లవి:

చిన్ననాఁడు మద్దులు వంచినవాఁడు తా-
నున్నవాఁడే యిపుడు నాయెడయఁడై నేఁడు

చ. 1:

గోవులఁ గాచినవాఁడు గొల్లెతల మేనిగబ్బుఁ -
దావుల పెనుభ్రమలఁ దగులువాఁడు
కోవిదుఁడెట్లనాయఁ గోమలులఁ బదియారు-
వేవురను వలపించే వెరవరెట్టాయెనే

చ. 2:

వెన్నలారగించువాఁడు విడువక వెకలియై
కన్నచోనే తిరిగేటి గద్దరీఁడు
వన్నెకాఁడెట్లానాయ వడి గోపవనితల -
నెన్నరాని చేఁతలెల్ల నెట్టు సేసినాఁడే

చ. 3:

కొండలెక్కి దాఁటువాఁడు కొండ మోచునట్టివాఁడు
కొండలే నెలవుగాఁ గైకొన్నవాఁడు
కొండుక పాయపువాఁడు గుబురైన తిరుమల-
కొండమీఁద నెలకొన్న కోనేటివాఁడు