పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0026-1 సామంతం సం: 05-144

పల్లవి:

ఎట్టు ధరింపఁగనగు భువినిట్టి వియోగావలస్థల-
నట్టును నిట్టును విధి దమునారడిఁ బెట్టఁగను

చ. 1:

కాంతునిచూపులఁ జిక్కినకాంత వియోగాగ్నికిఁ దగ
శాంతికిఁ జెంగలువలుపైఁ జల్లిరి నెచ్చెలులు
కాంతుఁడు చూచినతొల్లిటి కనుచూపులె బహుళములై
కాంతశరీరంబంతయుఁ గప్పిన తెఱఁగాయ

చ. 2:

రమణునిమాటలఁ దగిలిన రమణికి నంగజతాపం-
బమరఁగ మకరందముపై నలికిరి నెచ్చెలులు
రమణుని తియ్యని మాటాలరచనలె కడునగ్గలమై
కమలదళాక్షికిఁ బై పై గట్టినతెఱఁగాయ

చ. 3:

ప్రాణము సందియమై యీ పడతికిఁ బ్రాణము వచ్చెను
ప్రాణేశుఁడు తిరువేంకటపతి గరుణించినను
ఏణాక్షికి నొకతెకుఁ గాదీయఖిలంబున కీ దేవుఁడు
ప్రాణము ప్రాణంబనియెడి పలుకిది నిజమాయ