పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0026-2 కాంభోది సం: 05-145

పల్లవి:

ఇంతగాఁ జేసితి నన్ను నింతలోననె వోరి
సంతవలపుబేరాల జట్టికాఁడ రారా

చ. 1:

గంపంత దురుముతోడి గబ్బిచూపుఁగన్నుల
గుంపెన గుబ్బలది మేకులు సేయఁగా
అంపలేక మాటలాడే వాపె తోడనె వోరి
జంపు వలపుబేరాల జట్టికాఁడ రారా

చ. 2:

గుద్దలింపుఁ గులుకుల కొనవంపుచూపుల -
అద్దపుఁ జెక్కులది నిన్నద్దలించఁగా
పెద్దరికా లాకెతోడ బెరయించేవా వోరి
చద్దివలపుబేరాల జట్టికాఁడ రారా

చ. 3:

మెల్లనె మురిపములమ్మెడి లేఁతమాటల-
గొల్లెతచిత్తమంతయుఁ గొల్లగొంటివి
వెల్లిగా నన్నుఁ గూడితి వేంకటేశుఁడా వోరి
చద్దివలపుబేరాల జట్టికాఁడ రారా