పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0025-6 శుద్దవసంతం సం: 05-143

పల్లవి:

ఇన్ని రాసులయునికి యింతి చెలువపురాశి
కన్నె నీరాశికూటమి గలిగినరాశి

చ. 1:

కలికి బొమవిండ్లుగల కాంతకును ధనురాశి
మెలయు మీనాక్షికిని మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
చెలఁగు హరిమధ్యకును సింహరాశి

చ. 2:

చిన్నిమకరాంకపు బయ్యెద చేడెకు మకరరాశి
కన్నెపాయపు సతికి కన్నెరాశి
వన్నెమై పైఁడితులఁదూఁగు వనితకుఁ దులారాశి
తిన్ననివాఁడి గోళ్ళసతికి వృశ్చికరాశి

చ. 3:

ఆముకొను నొరపుల మెరయు నతివకు వృషభరాశి
గామిడి గుట్టుమాఁటల సతి కర్కాటకరాశి
కోమలపు చిగురువమోవి కోమలికి మేషరాశి
ప్రేమ వేంకటపతిఁ గలసె ప్రియమిథునరాశి