పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0025-5 ఆహిరి సం: 05-142

పల్లవి:

కామించి నీవరుగఁ గలయు నాయకుఁడు నేఁ-
డేమి భాగ్యము సేసెనే తరుణి

చ. 1:

కాఁగిన గుబ్బలమీఁద కమ్మఁజెమటలఁ దొప్పఁ-
దోఁగిన పయ్యెదకొంగు దూలఁగను
వేఁగైన కొప్పున క్రొవ్విరులు దురిమి విఱ్ఱ-
వీఁగుచు నీవెటు వొయ్యెవే తరుణిం

చ. 2:

ఒప్పైన శిరసుమీఁదఁ గుప్పళించిన జవ్వాది
చిప్పిలి చెక్కులవెంటఁ జిందఁగను
అప్పళించిన కస్తూరిలప్పలు రాలఁగ నీ-
విప్పుడెక్కడికి నేఁగేవే వోతరుణి

చ. 3:

వీడినది మొలనూలు విరులు చెదరెఁ గొంత
వాడినది కెమ్మోని వన్నెలై
యీడులేని తిరువేంకటేశుఁడిదె నిన్నుఁ గూడె
యీడఁ గొత్తలివి యేఁటివే వోతరుణి