పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0025-1 సామంతం సం: 05-138

పల్లవి:

పొద్దిఁకనెన్నఁడు వొడచునొ పోయినచెలి రాదాయను
నిదుర గంటికిఁ దోఁపదు నిమిషంబొకయేఁడు

చ. 1:

కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు
నున్నని యొయ్యారంబులు నొచ్చినచూపులును
విన్నఁదనంబుల మఱపులు వేడుకమీరిన యలపులు
సన్నపుఁజెమటలుఁ దలఁచిన ఝల్లనె నామనసు

చ. 2:

ఆఁగినరెప్పల నీరును నగ్గలమగు పన్నీటను
దోంగియుఁ దోఁగనిభావము దోఁచిన పయ్యెదయు
కాఁగిన దేహపు సెకలును కప్పిన పువ్వుల సొరబులు
వేఁగిన చెలితాపమునకు వెన్నెల మండెడివి

చ. 3:

దేవశిఖామణి తిరుమలదేవునిఁ దలఁచినఁ బాయక
భావించిన యీ కామిని భావములోపలను
ఆవిభుఁడే తానుండిఁక నాతఁడె తానెఱఁగఁగవలె
నీ వెలఁదికిఁ గల విరహంబేమని చెప్పుదము