పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0024-6 మాళవి సం: 05-137

పల్లవి:

ఏమిసేయఁగనగు నెట్టువలసిననౌ
కాముకుల పూర్వసంకల్పమో కాక

చ. 1:

కమలోచనహృదయకమలంబె మరుచేతి-
కమలమై తనమనసు గాఁడి పారినది
గములైన యాపదలు గదిరినప్పుడు దమ్ము
తమచేతియమ్ములే తాఁకునో కాక

చ. 2:

లోలలోచన మేనిలోని యనలము లోని-
గాలి గూడక చిచ్చు గాలివలెనాయ
తాలిమెడతెగి రతులు దప్పినప్పుడు లోని-
తాలిమే తమకములతాపలో కాక

చ. 3:

శ్రీ వేంకటేశ్వరుఁడు చెలియఁ గరుణించినను
కైవశంబయిఁ యవియ కడునితవులాయ
దైవకృప గలిగినను తమకు నాపదలెల్ల
భావింప నిత్యవైభములో కాక