పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0024-2 సామంతం సం: 05-133

పల్లవి:

కొనచూపులనె వింతకోరికలు దైవార
పెనగొన్న తమకములఁ బెనఁగు టెన్నఁడురా

చ. 1:

కమ్మ కస్తూరితావి కప్పురపువాసనల-
తమ్ములము నోరిలోఁ దగఁ గులికి కులికి
ఉమ్మగింతల రతులనుడివోని వేడుకల
ఇమ్ములను గడి సుఖియించు టెన్నఁడురా

చ. 2:

బిగువుఁ గౌఁగిటఁ జేర్చి బిత్తరపుఁ జూపులను
నగవు దేరఁగ మనసు నాఁటించి మించి
మొగము మొగమునఁజేర్చి ముద్దుమాటలను నునుఁ-
బగడవాతెర గదలఁ బలుకు టెన్నఁడురా

చ. 3:

కడు మోహమున సిగ్గు గదియు టెన్నఁడు లేక
యెడలేని కూటముల యెచ్చరిక లేక
విడువకిటువలెనె తిరువేంకటేశుఁడ నీవు
వడిఁదలఁచి నాకడకు వచ్చుటెన్నఁడురా