పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0024-1 పాడి సం: 05-132

పల్లవి:

అవి యెటువంటి రహస్యములో
సవరని సతులకు ఝల్లనె మేను

చ. 1:

కల గని చెలితో కాంత నాయకుని-
చెలువము చెప్పుచు చిడిముడితో
పలుకఁగ నేరక భ్రమసిన మాటలు
తలఁచి చెలులు కడుఁ దత్తరపడిరి

చ. 2:

రమణుఁడు కలలో రమణితో ననిన-
ప్రమదపు దైన్యపు పలుకులివి
చెమరించఁగ విని శిరసులు వంచుక
కొమెరలు దలఁచిరి కూరిమిపతుల

చ. 3:

వేంకటరమణుఁడు వెలఁదియుఁ గలలో
బింకపుఁ గూటమిఁ బెనఁగుటలు
లంకెల పొందులు లలనలు విని విని
కొంకక కనుఁగొనఁ గురిసిరి నీరు