పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0023-6 సామంతం సం: 05-131

పల్లవి:

చింతాపరంపరలు చిత్తంబునకుఁ దొడవు
ఇంతి సౌభాగ్యంబులిన్నిటికిఁ దొడవు

చ. 1:

కలికి నెమ్మోమునకుఁ గబరీభరము తొడవు
తళుకుఁజూపులు చక్కఁదనమునకుఁ దొడవు
ఎలమిచెక్కుల మించులిరువంకలకుఁ దొడవు
మొలకనగవులు సొబగు మురిపెముల తొడవు

చ. 2:

కరమూలరుచులు బంగారంబునకుఁ దొడవు
గురిగాని కౌఁదీగె గుబ్బలకుఁ దొడవు
సిరిదొలఁకు జఘనంబు చిన్నినడపుల తొడవు
నిరతంపుఁ బాదములు నిలువునకుఁ దొడవు

చ. 3:

శ్రీవేంకటేశుకృప చెలియ కెప్పుడుఁ దొడవు
భావసంగతులకునుఁ బరవశమె తొడవు
ఈ వెలఁది నునుఁబలుకులించువిలుతుని తొడవు
లావణ్యములకు నీలలన దాఁ దొడవు