పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0023-5 ఆహిరి సం: 05-130

పల్లవి:

లలితలావణ్య విలాసముతోడ
నెలంత ధన్యత గలిగె నేఁటితోడ

చ. 1:

కుప్పలుగా మైనసలుకొన్న కస్తూరితోడ
తొప్పఁదోగేటి చెమటతోడ
అప్పుడటు శశిరేఖలైన చనుఁగనతోడ
దప్పిదేరేటి మోముఁదమ్మితోడ

చ. 2:

కులుకుఁ గబరీభరము కుంతలంబులతోడ
తొలఁగఁ దోయని ప్రేమతోడ
మొలకనవ్వులు దొలఁకు ముద్దుఁజూపులతోడ
పులకలు పొడవైన పొలుపుతోడ

చ. 3:

తిరువేంకటాచలాధిపుని మన్ననతోడ
సరిలేని దివ్యవాసనలతోడ
పరికించరాని అరవిరిభావముతోడ
సిరి దొలఁకెడి చిన్నిసిగ్గుతోడ