పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0003-1 శ్రీరాగం సం: 05-012

పల్లవి:

మగువ వూర్పులనైన మనుఁగా చలిగాలి
నిగుడుఁగా జగమెల్ల నిండఁ దనరూపు

చ. 1:

అతివవదనము వాడ నలరి చందురుఁడైన
బ్రతుకుఁగా వొకకొంత బయలుమెరసి
సతి యెలుఁగు రాయ విరసపు బికావళియైన
తతిఁ జెలఁగుఁగా నేడు తమకెదురు లేక

చ. 2:

తెఱవ వేనలి చెదర తేఁటి మొత్తములైన
మెఱయుఁగా వొకకొంత మేలుగలిగి
ఒఱగి యలసతతోడ నువిద కనుమోడ్పుగా
నెఱిఁ గలువలలరుఁగా నేఁటిమాపైన

చ. 3:

తరుణి దేహము నాటి దర్పకుని శరమైన
పరిమళము నిండుగా బహువిధమున
కరిగమననిపుడు వేంకటవిభుఁడు కౌగిటను
కరుణించ లతలైనఁ గాంచుఁగా తెలివి