పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0023-3 సామంతం సం: 05-128

పల్లవి:

అపురూపమైన మోహము దాఁచి యిటువంటి-
కపటపు నటనలు గడియించనేలే

చ. 1:

కిన్నెరకాయలఁ బోలు కిక్కిరిసినట్టి గుబ్బ-
చన్నులపై ననుఁగొంగు జారఁగ
కిన్నెర మీఁటుచు మంచి సన్నపు నడపుతో
కన్నులు దేలఁగమేను కదలించేవేలే

చ. 2:

వీడియు వీడనికొప్పు వేగన ముడుచుచు
ఆడెడి బిత్తరిమాటలమరఁగా
చూడనొప్పె నీ మంచి సుద్దులు చెప్పఁగనెంతే
వాడక వాడుదురే వైతాళమీలే

చ. 3:

చెక్కుటద్దములమీఁది చెమట చిత్తడితోడ
సొక్కులు దేరఁగ మేను సుదతికి
చిక్కించి నిన్నుఁగూడె శేషగిరీంద్రుఁడు నీ పయి
మక్కువగలిగి కొంత మనసియ్యఁడేలే