పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0023-2 భైరవి సం: 05-127

పల్లవి:

భామ నోఁచిన నోము ఫలము సఫలముగాను
కామతాపంబునకు కాండవము నోమె

చ. 1:

కొమ్మ చలిమందులకు గొంతిదామెర నోమె
కమ్మఁదావులకు మును గౌరినోమె
నెమ్మదిని కన్నీట నిండుఁగొలఁకులు నోమె
ముమ్మడించిన వగల ముచ్చింత నోమె

చ. 2:

చెదరు గందంబునకు చిట్టిబొట్లు నోమె
కదియు పులకలకు మొలకలనోము నోమె
ముదిత మాటాడకిదె మోనదాగెలు నోమె
పొదలు చెమటలకు నినుపులనోము నోమె

చ. 3:

నెలఁత మొగమునకు వెన్నెలమించులటు నోమె
వెలయుఁగాంతికి వీధివెలుఁగు దా నోమె
ఎలమితోఁ దిరువేంకటేశుకౌఁగిటఁ గూడి
లలితాంగి నిచ్చకల్యాణంబు నోమె