పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0022-4 ఆహిరి సం: 05-123

పల్లవి:

అన్ని జాతులు దానె యైవున్నది
కన్నులకలికి మాయగరచెనో యనఁగ

చ. 1:

కన్నె శంకిణిజాతి గాఁబోలు వీఁపునను
సన్నపు మదనాంకములు జడి గొన్నవి
వన్నెలుగ వలరాజు వలపు తలకెక్కించ
పన్నినటువంటి సోపానములో యనఁగా

చ. 2:

తెఱవ దలపోయ చిత్తిణిజాతి గాఁబోలు
నెఱులు విచ్చుచు వీధి నిలుచున్నది
నెఱతనము మరుఁడు తను నిండవేసిన యంప-
గరులిన్ని యనుచు లెక్కలు వెట్టుగతిని

చ. 3:

కాంత హస్తిణిజాతి గాఁబోలు కరమూలము-
లంతకంతకు నలుపులై యున్నవి
పంతంపుమరుఁడు తన భండారమిండ్లకును
దొంతిగా నిడిన కస్తూరి ముద్రలనఁగా

చ. 4:

ఘనత పద్మిణిజాతి గాఁబోలు నీలలన
తనువెల్ల పద్మగంధంబైనది
మినుకుగా మరుఁడు తామెరలమ్ములనె మేను
కనలించి వడిఁ బువ్వుఁగట్టెనో యనఁగా

చ. 5:

ఇదియు జగదేక మోహిణి దానె కాఁబోలు
కదలు కనుఁగవకెంపు గలిగున్నది
వదలకిటు వేంకటేశ్వరుని కుంకుమపూఁత
చెదరి చెలికనుఁగొనలఁ జిందెనోయనఁగా