పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0022-3 వరాళి సం: 05-122

పల్లవి:

కటకట సతిశృంగారము కన్నులపండువు దోఁపుచు
యిటువలె నిలిచి చిత్తంబిందరినేఁపెడిని

చ. 1:

కోమలి కొప్పున జెరివిన క్రొవ్విరులాత్మజు శరములు
వేమరుఁ బొదిగొన నాఁటిన విధమున నొప్పెడిని
కామిని పూసిన కస్తూరి కంతుని బాణారుణిమే
యీమైఁ బైపైఁ బేరిన యిటువలె నొప్పెడిని

చ. 2:

అతివకు భూషణజాలంబంతయు మరువస్త్రములకు
జతనంబగు మైమరువై సరిఁ జెలువొందెడిని
సతి గట్టన వెలిపుట్టము చంపెడు మదనుని బారికి
సితకరుఁడడ్డము చొచ్చిన చెలువము దోఁపెడిని

చ. 3:

బలుపగు చెలిచనుగుబ్బలపై వేంకటపతి నించిన-
లలితపు రేఖల బిత్తరిలాగులు దోఁపుచును
వలరాయని చిరునమ్ములు వడిఁదాకిన గంట్లవలెఁ
బొలుపుగఁ జూచినవారల బొమ్మరపరపెడిని