పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0022-1 పళపంజరం సం: 05-120

పల్లవి:

ఏమిటికిఁ జింత యిదె నీకు
ప్రేమపుఁ బెండ్లి బెరసెఁగా నీకు

చ. 1:

కలికి నీ చూపుల కలువదండలు దెచ్చి
తలఁకకాతనిమెడఁ దగులవేసి
మొలక నగవుల నీ ముత్యపుసేసలు చల్లి
తొలఁగని పెండ్లి దొరకెఁగా నీకు

చ. 2:

చనపుఁ గూరిముల కొసరులను గరమిడి
ఘనమైన కాఁకలఁ గాలుదొక్కి
పనివడి వెన్నెల పాలకూడు గుడిచి
తనివోని పెండ్లి దగిలెఁగా నీకు

చ. 3:

తరుణి నీ హృదయపుఁ దమ్మిపరపుతోడ-
నిరవైన సిరులతో నిల్లు నించి
తిరువేంకటగిరి దేవునితోఁగూడి
సరసపు బెండ్లి జరగెఁగా నీకు