పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0021-5 ఆహిరి సం: 05-118

పల్లవి:

చెంగటనె చెలువంపుఁ జీఁకటి దవ్వఁగను
ముంగిట నిధానమబ్బె మొక్కుదుఁగాకిఁకను

చ. 1:

కొండుకవయసు కొమ్మగుబ్బలపై బ్రేమపు-
టెండదాఁకి పులకలనెన్ను వెళ్ళఁగా
బెండుపడి కైవాలెఁ బెనుదురుమిఁకనేమి
పండెఁ గోసుకొందుగాక పనులేఁటికిఁకను

చ. 2:

చక్కని జవ్వని కన్నుఁజాయల పాదరసము
పుక్కిటి వెచ్చని పూరుపుల నూదఁగా
గక్కన బంగారాయ కడలేని కోరికలు
దక్కెఁ దీసుకొందుగాక తడవేల యిఁకను

చ. 3:

పల్లదపుఁ జెమటల పాల జలనిధి దచ్చి
వెల్లిగొన సిరులెల్ల వేంకటేశుఁడా
పల్లవాధరిచనపు పచ్చిదేర వేడుకెల్ల
కొల్ల చేకొందువుగాక కొంకనేఁటికిఁకను