పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0021-3 కన్నడగౌళ-అటతాళం సం: 05-116

పల్లవి:

తురుము నీవియు జార తొయ్యలి వెరగంద
సిరులఁ బరవశము సేసితిగా నీవు

చ. 1:

కొమ్మమోవి నీకుఁ బిల్లగోవిగాఁగ నిడుకొని
కుమ్మరించుఁగుత్తుకలోఁ గులుకుచును
తమ్ములపు రసము చిత్తడిగాఁ గురియుచు
చిమ్మిరేఁగ రాగము నించితివిగా నీవు

చ. 2:

పడఁతిగుబ్బలు నీకుఁ బాంచజన్యములుగా
కడివోని మొనలోలిఁ గదియ నొత్తి
తడయక మదనయుద్దము గెలిచితినంటా
వొడలి చెమటలార నూదితిగా నీవు

చ. 3:

వెలఁదివీఁపిది నీకు వీణె వొళవుగా
ములువాఁడి కొనగోళ్ళ మోఁపి మోఁపి
కలసి కౌఁగిటను వేంకటగిరి విభుఁడ నీ-
మెలుపుఁగళల తంతి మీఁటితిగా నీవు