పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0021-2 వరాళి సం: 05-115

పల్లవి:

సొంపుల నీ వదనపు సోమశిల కనుమ
యింపులెల్లఁ జేకొనఁగ నిల్లు నీపతికి

చ. 1:

కలికి నీపిఱుఁదనే గద్దెరాతికనుమ
మొలనూళ్ళలతలనే ముంచుకొన్నది
కలయఁ బోకముడినే కట్లువడ్డది
అలరువిలుతుదాడికడ్డము నీ పతికి

చ. 2:

ఇదివొ నీ కెమ్మోవి యెఱ్ఱశిల కనుమ
కదిసి లేఁజిగురులఁ గప్పుకొన్నది
వదలకింతకుఁ దలవాకిలైనది
మదనుని బారికి మాఁటువో నీ పతికి

చ. 3:

కాంత నీ చిత్తమే దొంగలసాని కనుమ
యింతటి వేంకటపతికిరవైనది
పంతపు నీ గుబ్బలే గుబ్బలికొండకనుమ
మంతనాల కనుమాయ మగువ నీ పతికి