పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0020-6 నాదరామక్రియ సం: 05-113

పల్లవి:

ఏమి సేయుదునమ్మ యిన్నియును నిటుగూడె
తామసపుఁ బ్రేమ వేదనఁ బాయనీదు

చ. 1:

కినిసి నే పొలసి పలికెద నంటినా యతని-
నెనయుదఁడఁబాటు నోరెత్తనీదు
చెనకి యలపార జూచెద నంటినా యతని-
కనుఁగవ జలంబు సరుగనఁ జూడనీదు

చ. 2:

కిందుపడి కదిసి మ్రొక్కెద నంటినా యతని-
యంది పరవశము చేయాడ నీదు
డెందంబు మఱచి యుండెద నంటినా యతనిఁ
జెందిన తలఁపు మఱచియు మఱవనీదు

చ. 3:

తిరువేంకటేశుఁ బొందితినంటినా యతని-
దొరతనము నాగరిమ దోఁచనీదు
సిరిదొలఁకు రతుల నలసితి నంటినా యతని-
సరసంబు వేడుకలఁ జాలించనీదు