పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0020-5 కాంబోది సం: 05-112

పల్లవి:

అతివ జవ్వనము రాయలకుఁ బెట్టిన కోట
పతి మదనసుఖరాజ్యబారంబు నిలుప

చ. 1:

కాంతకనుచూపు మేఘంబులోపలి మెఱుఁగు
కాంతుని మనంబు చీఁకటి వాపను
ఇంతి చక్కనివదన మిందుబింబము విభుని-
వంత కనుదోయి కలువలఁ జొక్కఁజేయ

చ. 2:

అలివేణిధమ్మిల్లమంధకారపు భూమి
కలికి రమణునకు నేకతమొసఁగను
పొలఁతికి బాహువులు పూవుఁదీగెల కొనలు
పొలసి ప్రాణేశు వలపుల లతలఁ బెనచ

చ. 3:

పంకజాననరూపు బంగారులో నిగ్గు
వేంకటేశ్వరు సిరులు వెదచల్లఁగా
చింకచూపుల చెలియచేఁత మదనునిచేఁత
యింకా నతనినె మోహించఁ జేయఁగను